వరదలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ వివరాలేవి..? ఆ కుటుంబాలకు చేయూతనిచ్చారా? కడెం ప్రాజెక్టు కింద ఉన్నవారి సంగతేంటి? రాష్ట్రంలో భారీ వర్షాలు- వరదలు.. వరద ప్రభావంపై 4వ తేదీకల్లా సమగ్ర నివేదిక ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరద బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
వరద బాధితుల కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరకు సుధాకర్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 41 మంది మృతి చెందారంటూ ఇచ్చిన నివేదికలో భూపాలపల్లి జిల్లాలోని మృతుల వివరాలను చెప్పకపోవడాన్ని ఎత్తిచూపింది. కలెక్టర్లు గ్రామాల వారీగా తీసుకుంటున్న సహాయక చర్యలపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వర్షాలతో ఆందోళనకు అత్యవసర సేవలైన విద్యుత్తు సౌకర్యం, ఫోన్లు, ఇంటర్‌నెట్‌లను పునరుద్ధరించాలని పేర్కొంది. టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి అదృశ్యమైన వారి వివరాలను బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించింది. నిరాశ్రయులైన 14,216 మందికి నిరంతరాయంగా సేవలందించాలని.. జంతు, పంట నష్టాల వివరాలతో సమగ్ర నివేదిక అందజేయమని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.