మార్చి నెల ప్రారంభంలోనే రాష్ట్రంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, ఖమ్మం జిల్లా మధిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయని వెల్లడించాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.