భారత్లో ఈ ఏడాది సీజన్లు లయతప్పుతున్నాయి. మండు వేసవిలో కూడా వణికించే వర్షాలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత పదిరోజులుగా గ్యాప్ ఇస్తూ మరి వరణుడు తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే చేతికొచ్చిన పంటంతా నీటిపాలై రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పంట నష్టపోయి తీవ్ర బాధలో ఉన్న కర్షకులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో పిడుగు వేసింది.
తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని, ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో 8న వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని తెలిపింది. అది ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తుపానుగా బలపడే అవకాశముందని వివరించింది.
దీని తీవ్రత, ప్రయాణించే మార్గం తదితర వివరాలు అల్పపీడనంగా మారిన తర్వాత తెలుస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 8వ తేదీ నుంచి పొడి వాతావరణం ఏర్పడి గరిష్ఠ(పగటి) ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.