అసెంబ్లీ ఎన్నికల రాజకీయంతో వేడెక్కిన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం రెండ్రోజులుగా చల్లబడింది. ఇక గురువారం రోజు ఏకంగా వర్షం కురిసింది. అయితే ఈ వర్షాలు మరో రెండ్రోజులు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 27.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఇక.. మెదక్‌లో 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసలే చలికాలం.. అందులో వర్షాలు కురుస్తుండటం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.