తెలంగాణలో ఓవైపు ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో.. మరోవైపు చలి చంపేస్తోంది. ఇది చాలదన్నట్లు వర్షాలు కూడా మొదలయ్యాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మంగళవారం రోజున నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1సెం.మీ.ల వర్షం కురిసినట్లు చెప్పారు. మరోవైపు నిజామాబాద్ నార్త్‌లో 4.35సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93సెం.మీ.లు, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు, చిన్నమావంధిలో 3.15సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.
వాతావరణ శాఖ ప్రకటనతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల వల్ల నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 30వ తేదీన పోలింగ్ నేపథ్యంలో వర్షం వల్ల ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.