తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి – అదానిలు కలిసి ఉన్న ఫోటోలతో టీ షర్టులు ధరించి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి – అదాని ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
రేవంత్ – అదాని టీ షర్టులతో అసెంబ్లీ లోనికి వెళుతుండగా గేటు నెంబర్ రెండు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్టులు వేసుకోవడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే హరీష్ రావు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళుతున్న తమను అడ్డుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ పై కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా..? అని ప్రశ్నించారు.