బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ శ్రేణులు కొట్టి చంపినట్లు వార్తలు వస్తున్నాయి. గ్రామంలో రోడ్డు నిర్మాణం విషయమై ఘర్షణ పడి కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేసి పారిపోయారు కొందరు దుండగులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం సింగార్ బోగుడ తండాలో 2023లో రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు అయింది.
వివిధ కారణాల వల్ల ఆలస్యమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదట నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయం మాట్లాడేందుకు తండా వాసులు సమావేశం కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీను నాయక్ (25) అనే బీఆర్ఎస్ కార్యకర్త మీద కాంగ్రెస్ శ్రేణులు కర్రలు, రాళ్లతో కొట్టి దాడి చేయగా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తులు తండా నుండి పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు.