తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు శనివారం రోజున శ్రీవారిని 73,051 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,599 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు అర్పించారు. ఇక శనివారం ఒక్కరోజే వేంకటేశ్వర స్వామికి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు సమకూరింది.
మరోవైపు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు రద్దవనున్నాయని తెలిపింది. తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు. ఇక రేపు స్వర్ణరథం పై మాడవీధులలో ఉరేగనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిగా దర్శనం ఇస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.