కేంద్ర ప్రభుత్వం వినాయక నవరాత్రుల కానుక గా కాచిగూడ నుంచి బెంగళూరు రైలు.. 24వ తేదీన ప్రారంభం
దాదాపు 610 కిలోమీటర్ల దూరం 8.30 గంటల్లోనే పూర్తి చేశారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఈ రైలు ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొనున్నారు.
22 సెప్టెంబర్, 2023, హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది.
24 తేదీనుంచి కాచిగూడ (హైదరాబాద్)-
యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. మొదటిరోజు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత ప్రతిరోజూ (బుధవారం మినహా) కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్ (6.59), కర్నూల్ సిటీ (8.39), అనంతపూర్ (10.54) స్టేషన్లలో ఆగుతూ యశ్వంత్‌పూర్ (మధ్యాహ్నం 2.15) చేరుకుంటుంది.మధ్యాహ్నం 3గంటలకు యశ్వంత్‌పూర్‌నుంచి బయలుదేరి, అనంతపూర్ – 5.40, కర్నూల్ సిటీ 7.50, మహబూబ్‌నగర్ 21.39 స్టేషన్లలో ఆగుతూ.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మధ్యాహ్నం 12.30కి కాచిగూడ నుంచి బయలుదేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్,దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు:
– ఇది 12 జిల్లాల గుండా వెళ్తుంది (తెలంగాణ – హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్; ఆంధ్రప్రదేశ్ – కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి; కర్ణాటక – చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్)
– సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లు
– గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20 గంటలు.. వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు
– ఈ మార్గంలో వచ్చే 4 ప్రధాన స్టేషన్లు కాచిగూడ (హైదరాబాద్), కర్నూల్, అనంతపూర్, యశ్వంత్‌పూర్ (బెంగళూరు)
– ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు.. సమతామూర్తి (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ), గోల్గొండ కోట, చార్మినార్, గద్వాల్ కోట, శ్రీశైలం (కర్నూలు సమీపంలో) సత్యసాయి ప్రశాంతి నిలయం (అనంతపూర్), బెంగళూరులోని పర్యాటక కేంద్రాలు
– దేశ ఐటీ రాజధాని, స్టార్టప్ రాజధానిని ఈ రైలు అనుసంధానం చేస్తుంది.