పెద్దనోట్ల రద్దు తర్వాత దాదాపు అన్ని రంగాలు డిజిటల్ పేమెంట్స్‌ను షురూ చేశాయి. టీ అమ్ముకునే వారి నుంచి.. పండ్లు, కూరగాయలు.. చివరకు పలుచోట్ల భిక్షాటన చేసుకునే వారు కూడా డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం పరిస్థితి అలాగే ఉంది. ఇంకా చిల్లర లేదని కండక్టర్ చికాకు పడటం.. చిల్లర కోసం ప్రయాణికులు తిప్పలు పడటం మాత్రం మారలేదు. ముఖ్యంగా సిటీ బస్సుల్లో ఈ పరిస్థితి కాస్త దారుణం.
అయితే సిటీ బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాదిలోనైనా.. సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు చెబుతున్నారు.