రంగారెడ్డి కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 400 ఎకరాల భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఇటు బీఆర్ఎస్, బీజేపీ.. అటు హెచ్‌సీయూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యవహారంపై మరోసారి స్పందించారు.
గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై మాట్లాడారు. హెచ్‌సీయూ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూములకు బదులుగా ఎప్పుడో ప్రభుత్వ భూములు ఇచ్చిందని ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి సర్కారు భూములేనని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు కోర్టు కేసు ఉన్నందువల్ల ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని.. కోర్టు స్పష్టమైన తీర్పునివ్వడంతో ఇప్పుడు సర్కార్ ఈ భూములను స్వాధీనం చేసుకోనుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.