శ్రీరామ నవమి వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇవాళ నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీతారాంబాగ్‌లోని రామాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగనుంది. ఈ యాత్రలో నగరవ్యప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు, రామయ్య భక్తులు పాల్గొననున్నారు.
శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శోభాయాత్ర సాగే మార్గంలో ఆంక్షలు విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్ – మంగళహాట్ పీఎస్ – పురానా పూల్ – బేగంబజార్ – సిద్ధంబర్ బజార్ – గౌలిగూడ – గురుద్వారా – రాంమందిర్ - తిలక్ పార్క్ – పుత్లిబౌలి – కోఠి ఆంధ్రాబ్యాంక్ – బడి చౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరనుంది. అంబర్పేట్ నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు కోఠి వ్యాయామశాలకు వస్తాయన్నారు.
ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్పేట్ కూడలి వద్ద కలవనుంది. శాంతియుతంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తామని.. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్న పానీయాలు అందుబాటులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.