తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఆత్మహత్యలు చేసుకోకూడదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రూపు 2 పరీక్ష వాయిదాతో వరంగల్ కి చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అన్నారు. ఆమె ఆత్మహత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నాలుగు కోట్ల ప్రజలు కూడా ఆమె ఆత్మహత్యను ఖండించాలన్నారు కోమటిరెడ్డి.
ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముఖ్యంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకూడదని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. సమయానికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్యలుండవన్నారు. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు కోమటిరెడ్డి. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. తెలంగాణ యువత సీఎం కేసీఆర్ ను గద్దె దింపేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.