కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీ దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుకు ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. కరీంనగర్ జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ శనివారం లేఖ రాసినట్లు తెలిసింది.
గత రెండేళ్లుగా వాయిదా పడిన ఓ ముఖ్యమైన విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నట్లు అందులో పేర్కొన్నారు. 2023లో కరీంనగర్ జిల్లాలో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, ప్రభుత్వం కూడా జిల్లాలోని పద్మనగర్‌లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని గుర్తుచేశారు. 2023 మే 31న రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ కూడా జరిగిందని గుర్తుచేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.కరీంనగర్ ప్రజలే కాకుండా, కాదు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతో ఆశగా ఉన్నారని వెల్లడించారు.