భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సేవలను స్మరించుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆదర్శనీయం అన్నారు. సమ సమాజం కోసం మనందరం పనిచేయడమే వారికి అందించే ఘన నివాళి అర్పించారు. స్వాతంత్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కేసీఆర్ కొనియాడారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్న ఆయన, వర్ణ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్, అనంతర స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, టెలికమ్యూనికేషన్స్, వ్యవసాయం, దేశ రక్షణ వంటి శాఖలకు వారు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. దేశ ఉప ప్రధానిగా సేవలందించిన వారి సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. వివక్ష రహిత సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం వారి సేవలను గుర్తించిన దేశ ప్రజలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సమతా దివస్‌గా జరుపుకోవడం, జాతి కోసం వారు చేసిన సేవలకు దర్పణంగా నిలుస్తుందని అన్నారు. వారి కార్యాచరణ నేటికీ ఆదర్శనీయమని, అంటరానితనం అనే దురాచారం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా మనందరం పని చేసిననాడే, డాక్టర్ జగ్జీవన్ రామ్ గారికి ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ తెలిపారు.