వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైస్ మిల్లర్లకు, మంత్రుల మధ్య లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంత్రి అండతోనే మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి.. రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికి రాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లోక్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిపాజిట్ సీట్లు సాధించబోతుందని జోస్యం చెప్పారు.