సెక్రటేరియట్ నీడలోకి కూడా ప్రజలను రానివ్వడని బీజేపీ నేత విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటూ సీఎం కేసీఆర్ గారు గొప్పలు చెప్పుకుంటున్న కొత్త సచివాలయంలో సామాన్యులకు చోటుందా?… అని నేను ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే మరో కొత్త విషయం బయటపడిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ పాలకులని ప్రశ్నిస్తే… సామాన్యులనే కాదు చివరికి ఎంపీ స్థాయి వ్యక్తినైనా సెక్రెటేరియట్ నీడలోకి సైతం రానివ్వరని తెలిసిందన్నారు.
మా బీజేపీతో పాటు తెలంగాణలో మరో ప్రతిపక్షమైన టీపీసీసీ అధ్యక్షుడు తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి ఎదురైన అనుభవం అదే చెబుతోంది. ఒక సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తికే సెక్రెటేరియట్‌లోకి ప్రవేశం లేదంటే ఇక మామూలు ప్రజల మాట పక్కన పెట్టాల్సిందే… నిజాం రాజుల కాలం నాటి రజాకార్ల తీరుగా ఇంత అహంకారం, ఇంత దౌర్జన్యంతో ప్రవర్తిస్తున్న ఈ సర్కారు అనుసరిస్తున్న కరడుగట్టిన విధానాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు… తగిన సమాధానం ఎట్లా చెప్పాల్నో తెలంగాణ బిడ్డలకు తప్పక తెలుసు అన్నారు విజయ శాంతి.