తెలంగాణ రైతులకు శుభవార్త. జూన్ మొదటి వారంలో రైతుబంధు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన తొలి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలలో సాగు అంచనా వేస్తున్నామని… మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు .. దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ సమాయత్తం కావాలని కోరారు. పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలని.. అందుబాటులో వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉంటాయని పేర్కొన్నారు.
సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలి .. దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల ఉంటుందని.. నానో యూరియా, నానో డీఎపీ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. వ్యవసాయ అవసరాలలో డ్రోన్ వినియోగంపై యువతకు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.