తెలంగాణలో కులగణన సర్వే ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న విషయం తెలిసిందే. నిన్న రాహుల్ గాంధీ బోయినపల్లి ఐడియాలజీ సెంటర్ వద్దకు చేరుకొని మేధావులతో చర్చించి పలు విషయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ కులాన్ని ఉద్దేశించి బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ, రాహుల్ హిందువో.. ముస్లీమో చెప్పాలన్నారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వీహెచ్, మంత్రి కొండా సురేఖలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు.
ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులమో కావాలంటే ఆయన ఇంటికి వెళ్లి అడగండి అంటూ సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీ కులంతో బీజేపీ నేతలకు ఏం పని అని ప్రశ్నించారు. కులగణన ఫామ్ తీసుకొని వెళ్లితే.. రాహుల్ గాంధే తన కులం ఏంటో చెబుతారని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు.