మహిళా దినోత్సవం రోజు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్టు మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా దినోత్సవం నిర్వహణ పై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ఇందిరా మహిళా శక్తి పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. నారాయణపేట జిల్లా మాదిరిగా మిగతా 31 జిల్లాల్లోనూ పూర్తిగా మహిళలే పెట్రోలు బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ఆ రోజున ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని సీతక్క చెప్పారు.
మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. వడ్డీలేని రుణాల చెక్కులను సీఎం పంపిణీ చేస్తారని.. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళలకు రూ.40కోట్ల బీమా చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నట్టు తెలిపారు. పట్టణాల్లో కూడా మహిళా సంఘాలను బలోపేతానికి సీఎం కీలక ప్రకటన చేసే అవకావం ఉందని తెలిపారు.