ఆర్టీసీ బిల్లు ఆమోదం విషయంలో గవర్నర్ తమిళిసై తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మేడ్చల్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు కవిత. అమరుల స్తూపాన్ని స్థాపించడానికి కమిటీ ఏర్పరచుకోవడం అభినందనీయమన్నారు. మంచి వ్యక్తులు పుట్టినప్పుడు భూమాత సంతోషిస్తుందని.. అలాగే జయశంకర్ గారు పుట్టినప్పుడు కూడా భూమాత సంతోషించి ఉంటుందన్నారు.
1948 నుండి ఆయన పోరాటం చేసి వారి స్ఫూర్తితోనే ఉద్యమం ఊపందుకుందని అన్నారు. అప్పట్లో అందరూ గులాబీ కండువా కప్పుకున్న వారందరినీ లక్ష తిట్లు తిట్టారని.. అప్పుడు తిట్టిన నోర్లే ఇప్పుడు పొగుడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని అన్నారు. గుజరాత్ కి ఒక నీతి.. తెలంగాణకి ఒక నీతా..? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బిల్లుకి ఎవరు అడ్డుపడుతున్నారో మీకు తెలుసని.. గవర్నర్ ని ఎవరు ఆడిస్తున్నారు కూడా మీకు తెలుసని ఎద్దేవా చేశారు.