ఆన్‌లైన్ బెట్టింగ్‌ల యాప్స్ వ్యవహారంపై ఓ వైపు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఈ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంలో ఓ రకంగా భాగమైన పలువురు యూట్యూబర్లు, సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ వ్యవహారంపై పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకుంటుండగానే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆన్ లైన్ బెట్టింగ్ వల్ల నష్టపోయి 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) అనే యువకుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గతకొంతకాలంగా సాయితేజ ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అలా అది వ్యసనంగా మారింది. చివరకు దానికి బానిస కావడంతో రూ.10 లక్షలకుపైగా అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చలేక ఈనెల 18వ తేదీన గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం రోజున సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంథనికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయితేజకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.