తెలంగాణలో తమ పార్టీ పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని చెప్పారు. ఆ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినపుడు అడ్డుపడటం సరికాదని తెలిపారు. కేసీఆర్ అవినీతి పాలనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతిస్తామని షర్మిల ప్రకటించారు.
‘ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలు బయటపెట్టిందే మా పార్టీ. కేసీఆర్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశం మాకు లేదు. తెలంగాణ సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సబబు కాదు. కీసీఆర్ అవినీతి పాలన అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు. తప్పు ఒప్పుకున్నట్లే కదా. మేం పోటీ చేయకపోవడం చాలా బాధాకరమైనా నిర్ణయం తప్పలేదు. ఇది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగం. ఈ విషయంలో నేను తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమించాలి. రాజకీయాల్లో చిత్తశుద్ధి, ఓపిక ఉండకపోతే రాణించలేరు.’ అని షర్మిల అన్నారు.