తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా కేసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం కేసిఆర్ ప్రభుత్వాన్ని ఏదొరకంగా ఇరుకున పెట్టాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అటు ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతి అంశంలోనూ కేసిఆర్‌ని విమర్శిస్తూ…టిఆర్‌ఎస్‌కు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. దీంతో టిఆర్‌ఎస్ నేతలు సైతం ఎలాగోలా రేవంత్‌కు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం రేవంత్‌ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రేవంత్ హైట్, పర్సనాలిటీ విషయంపై కామెంట్ చేశారు. తాము తలుచుకుంటే రేవంత్ ఎంత అన్నట్లుగా మాట్లాడారు. అయితే మొదట నుంచి రేవంత్, తలసానిలకు పెద్దగా పడదు. వీరు టిడిపిలో ఉన్నప్పుడే పెద్దగా పడేది కాదు. ఇక తలసాని టిఆర్‌ఎస్‌లోకి, రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చాక మరింతగా వారి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అయితే రేవంత్ పిసిసి అయ్యాక ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ చేసి కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తలసాని సొంత నియోజకవర్గం సనత్‌నగర్‌పై కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా తలసానికి చెక్ పెట్టేయాలని రేవంత్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సనత్‌నగర్ నియోజకవర్గం మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎక్కువసార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది. దివంగత మాజీ సిఎం మర్రి చెన్నారెడ్డి సైతం ఇదే నియోజకవర్గం నుంచి 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక మర్రి చెన్నారెడ్డి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డి 1992లో సనత్ నగర్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 1994, 2004, 2009 ఎన్నికల్లో సనత్ నగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. కానీ 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఈ సీటు టిడిపికి వెళ్లింది. దీంతో మర్రికి పోటీ చేసే అవకాశం దక్కలేదు.
అయితే వచ్చే ఎన్నికల్లో మర్రి శశిధర్ మళ్ళీ సనత్ నగర్ బరిలో దిగి తలసానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ శశిధర్ కాదు అనుకుంటే ఆయన తనయుడు మర్రి ఆదిత్యా రెడ్డి సనత్ నగర్‌లో పోటీ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే మర్రి ఫ్యామిలీ నుంచి ఎవరు బరిలో దిగిన తలసానికి చెక్ పెట్టాలనేది రేవంత్ ప్లాన్. మరి చూడాలి సనత్ నగర్‌లో తలసానికి చెక్ పడుతుందో లేదో?