ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ రాష్ట్రంలోని ప్రజలకు టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఆదివారం నుంచి ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అందులో భాగంగానే ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దానికి రోగులు డయల్ చేసి తమ అనారోగ్య సమస్యను సంబంధిత స్పెషలిస్టు డాక్టర్‌కు చెబితే.. వారు అందుకు తగ్గ మెడిసిన్ చెబుతారు. దాంతో ప్రజలు ఆ మెడిసిన్లను కొనుగోలు చేసి వాడవచ్చు.
ఇక టెలీమెడిసిన్ కోసం ఏపీలో 14410 ఫోన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేయవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు 10 నుంచి 15 మంది వివిధ స్పెషాలిటీలకు చెందిన డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రజలు 14410 నంబర్‌కు ఫోన్ చేయగానే.. సంబంధిత జిల్లాకు లైన్ కలిపి వారికి కావల్సిన స్పెషాలిటీ డాక్టర్‌తో మాట్లాడిస్తారు. దీంతో రోగి జబ్బు వివరాలను డాక్టర్ తెలుసుకుని అందుకు తగిన విధంగా వాడాల్సిన మందులను సూచిస్తారు. ఆ మెడిసిన్‌ను రోగులు డాక్టర్ సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. కరోనా కారణంగా చాలా వరకు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు స్వీకరించడం లేదు. మరోవైపు లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో ఆయా అనారోగ్య సమస్యలకు గాను ప్రజలు హాస్పిటళ్లకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఈ టెలీమెడిసిన్ సేవల ద్వారా డాక్టర్లు సూచించిన మేర మందులను వాడి.. తమ అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
కాగా టెలీమెడిసిన్ సేవల కోసం 0866 2410978 అనే రాష్ట్రవ్యాప్త కంట్రోల్ రూం నంబర్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే వైద్య సహాయం, సలహాలు, సూచనల కోసం ప్రజలు 104 నంబర్‌కు డయల్ చేయవచ్చు. ఇక కాల్ సెంటర్ కోసం 1902 నంబర్‌కు డయల్ చేయవచ్చు..!