తెలుగువారే కదా ! ఎందుకని తెలుగు మాట్లాడరు అని తోటి వారిని చూసి, ముఖ్యంగా ఈ తరం పిల్లలను చూసి మీరు అనుకోవద్దు.. తెలుగు వారే అయినా తెలుగు మాట్లాడరు అని మనసుకు సర్ది చెప్పుకోవడం ఇప్పుడొక గ్రహపాటు. తప్పదు.. మనం ఏం చేసినా ఏం చెప్పినా ఈ తరం తెలుగు భాషను ముందుకు తీసుకుని వెళ్లే పనులను మాత్రం చేయదు గా చేయదు. తల్లిదండ్రులకూ ఆ పరభాష మోజు ఆవిధంగానే ఉంది. కానీ ఎక్కడో ఉన్న ఆఫ్రికన్ కంట్రీ ఇథియోపియాలో ఉన్న వారు మాత్రం మన దేశం గురించి మన సంస్కృతి గురించి తెలుసుకుని, ఉప్పొంగిపోతుంటారు. మనం నేర్చుకోవాల్సింది మంచి భాషనే కాదు మంచి సంస్కృతినే కాదు కాస్త సంస్కారాన్ని కూడా ! హృదయగత సంస్కారం కారణంగానే నడవడి, భాష, వ్యక్తిత్వం అన్నవి అలవడుతాయి అని చెప్పడంతో ఈ ఉదయం ఆరంభం అవుతోంది. నేర్చుకోండి ఆ ఇథియోపియా మంత్రి నుంచి.. నేర్చుకోండి మన సంస్కృతి నుంచి..నేర్చుకోండి మంచి సాహిత్యం నుంచి సంబంధిత భావనా స్రవంతి నుంచి..
కాలాలు ఏమయినా సరే మనిషి గురించి మాట్లాడుకోవాలి. కావాలి అనుకుంటే తమ భాష గురించి కూడా మాట్లాడని మనుషులను వెలివేతలకు గురి చేయాలి. ఆహా ! మనం మాట్లాడని భాష ఏమౌతుంది.. మృతం అవుతుంది అంటే చచ్చి స్వర్గానికేగుతుందనా..? లేదా పాతాళంలో పల్టీలు కొడుతుందనా ? ఆమె చూడండి ఆమె అన్నగా ఆ ఇథియోపియా మహిళ మనం మాట్లాడానికే సంకోచించే సందేహించే మన మాతృభాష తెలుగును ఎంత బాగా పలుకుతోందో ! ఆమె పేరు : ఎర్గోజీ టెస్ఫాయీ,ఇథియోపియా మంత్రి ! ఇలా చెప్పడం చిన్న మాట కానీ ఆమెకు మన భాష తెలుసు..ఆ సోయగం తెలుసు.. అని చెప్పడం గొప్ప మాట ! సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో ఉంటూ మన భాష మన తేనెలొలుకు తెలుగును నేర్చుకోవడం భారతీయులకు గర్వకారణం. ఇటీవల కలిసిన భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.
మనం తెలుగు వారం కదా ! తెలుగు భాషను బతికిస్తున్నామా ! తెగి పడిన తల ఒకటి మెట్లపై దొర్లుతూ వెళ్తున్న చందంగా మన భాషలో పదాలు వాటి అర్థాలు ఆ విధంగా నరుక్కుంటూ వెళ్తున్నాం. భాషలో సౌందర్యాన్ని మరిచి ఏవేవో పదాలు కలిపి కల్తీ చేస్తున్నాం. మాలిన్యం చేస్తున్నాం అని రాయాలి. (మలిన సంబంధం మాలిన్యం..) అయినా కూడా ! ఇటువంటి వార్తలు వింటే ఆనందం. ఇటువంటి వార్తలు విన్నాక జీవితాన్నీ, భాషనూ సుసంపన్నం చేసే మనుషులు మన దగ్గరే కాదు విదేశంలోనూ ఉన్నారు అని తల్చుకోవడంలో గర్వం ఉంది. మిక్కిలి బాధ్యత కూడా ఉంది. బాధ్యత : భాష పరిరక్షణకు.. గర్వం : రేపటి వేళ ఈ పని నేను కూడా చేయగలిగాను అని చెప్పుకునేందుకు..కనుక ఈ ఉదయం ఈ విజయ దుందుభి మీలో గొప్ప స్ఫూర్తిని నింపాలి. ఇంగ్లీషు నేర్చుకోండి..తెలుగు మాధుర్యాన్ని మరిచిపోకండి..అని చెప్పడంలో సామాన్యం అయిన విశేషం ఒకటి ఉంది. ఆ సామాన్యాన్నీ, విశేషాన్నీ ప్రేమించండి చాలు. భాష తనంతట తానే బతకడం నేర్చుకుంటుంది.
ఇక ఈ ఇథియోపియా మంత్రి ఎర్గోజీ టెస్ఫాయీ గురించి మళ్లీ ప్రస్తావించుకుంటే.. ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాలో భారత రాయబార కార్యాలయం భవన సముదాయంను నిర్మించారు.