ఉత్తమ ఉపాధ్యాయుడంటే.. తప్పు చేసే విద్యార్థులను దండించే తండ్రిలా వ్యవహరించాలి. అంతేకానీ భయ పెట్టి, అస్తమానం కొడుతూ వారిపై అజమాయిషీ చెలాయించాలనుకోకూడదు.
కొందరు ఉపాధ్యాయులు పిల్లలను నయానా భయానో బెదిరించి పాఠాలు చెబుతూ విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు. ఇక కొందరైతే ఉగ్ర రూపం దాల్చి బెత్తం వదలకుండా విద్యార్థులను బాదుతూ పాఠాలు చెబుతారు. మన సమాజంలో ఈ రెండు రకాలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుడంటే విద్యార్థిని బెత్తం పట్టుకుని కొట్టే చదువు చెప్పాలా..? అసలు ఉత్తమ ఉపాధ్యాయుడంటే ఎలా ఉంటారు ? విద్యార్థులకు వారు చదువు ఎలా చెబుతారు..? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* ఉత్తమ ఉపాధ్యాయుడంటే.. తప్పు చేసే విద్యార్థులను దండించే తండ్రిలా వ్యవహరించాలి. అంతేకానీ భయ పెట్టి, అస్తమానం కొడుతూ వారిపై అజమాయిషీ చెలాయించాలనుకోకూడదు. అలా చేస్తే విద్యార్థులకు అలాంటి ఉపాధ్యాయులపై ఎన్నటికీ సద్భావం కలగదు. అలాగే వారి భయంతో విద్యార్థులకు పాఠాలు కూడా బుర్రకు ఎక్కవు.
* విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టులపై విద్యార్థులకు ఇష్టం కలిగేలా చేయాలి. అంటే.. ఏదైనా ఆహార పదార్థాన్ని ఇచ్చి భయ పెట్టి తినమంటే ఎవరూ తినరు కదా. దానిపై ఇష్టం కలిగేలా చేస్తే ఇక వద్దన్నా.. దాన్ని తినడం ఆపరు. అలాగే ముందుగా సబ్జెక్టులపై ఇష్టం కలిగేలా చేస్తే.. ఆ తరువాత విద్యార్థులు ఆటోమేటిగ్గా పాఠాలకు తీపి పదార్థాలకు అలవాటు పడినట్లుగా అలవాటవుతారు. ఇక వారు ఆయా పాఠ్యాంశాల్లో మెరికల్లా తయారవుతారు. అంతేకానీ భయపెట్టి బోధిస్తే ఫలితం రివర్స్‌లో వస్తుందనే విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలి. ఈ విషయాన్ని గ్రహించి విద్యాబోధన చేసిన వారే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందుతారు.
* సమాజంలో ఉండే అందరూ ఒకేలా తిండి తినరు కదా. కొందరు ఎక్కువ తింటే మరికొందరు చాలా తక్కువ తింటారు. అలాగే ఏ విషయాన్నయినా అర్థం చేసుకోవడంలో విద్యార్థులు కొందరు అందరికన్నా ముందే ఉంటే.. కొందరికి ఒక పట్టాన సబ్జెక్టు అర్థం కాదు. అలాంటి వారి పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అంతేకానీ పాఠం చెబుతున్నాం కదా.. అందరికీ అదే అర్థమవుతుందిలే అని ఉపాధ్యాయులు అనుకోకూడదు. విద్యార్థులందరికీ ఒకేలా గ్రహణ శక్తి ఉండదు. మందబుద్ధిగా ఉండేవారి పట్ల టీచర్లు ప్రత్యేక చొరవ చూపించాలి. అలాంటి టీచర్లనే విద్యార్థులు ఇష్టపడుతారు.
* తరగతి గదిలో కొందరు ఉపాధ్యాయులు సీరియస్ గా ఉంటారు. అది విద్యార్థుల మనస్తత్వంపై ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులతో ఒక స్నేహితుడిలా మెలిగితే వారి లోటుపాట్లు తెలుసుకుని వారికి విద్యాబోధన చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక క్లాస్ రూంలో టీచర్లు ఎప్పుడూ విద్యార్థులతో సరదాగా ఉండాలి. అప్పుడే వారు ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు.
* క్లాస్‌లో ఏ విద్యార్థి అయినా సరే.. ఎలాంటి సమస్య అడిగినా.. ఫలానా పాఠం అర్థం కాలేదని అడిగినా.. దాన్ని వారికి క్షుణ్ణంగా విడమరిచి చెప్పగలిగే.. సమస్యను ఎలా సులభంగా సాధించాలో వివరించే విధంగా ఉపాధ్యాయులు ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయులపై విద్యార్థులకు చక్కని ఇంప్రెషన్ ఏర్పడుతుంది. విద్యార్థులు ఏదడిగినా చెప్పగలిగే నైపుణ్యం, చాతుర్యత ఉత్తమ ఉపాధ్యాయులకు ఉంటాయి.
* ఇక చివరిగా పరీక్షలు, మార్కుల విషయానికి వస్తే.. సాధారణంగా ఏ ఉపాధ్యాయుడు అయినా సరే.. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే విద్యార్థులను చితకబాదుతారు. నిజానికి అలా చేయరాదు. వారికి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో, తదుపరి వాటిని ఎలా పెంచుకోవాలో.. మార్కులు తక్కువ రాకుండా ఎలా చూసుకోవాలో.. ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాలి. విద్యార్థుల్లో ఉన్న లోటుపాట్లను, వారు చేసే తప్పులను వారికి విడమరిచి చెబితే ఆ తరువాత వారు ఆ తప్పులను చేయకుండా ఉంటారు. దాంతో వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక అలా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే ఉత్తమ ఉపాధ్యాయులుగా కీర్తింపబడతారు.