దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలను ప్లాన్ చేసింది కవితే అన్నారు. ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
పంజాబ్ రైతుల పేరుతో కేసీఆర్ పర్యటనలు చేశారని మండిపడ్డారు ధర్మపురి అరవింద్. కవిత విషయంలో కేటీఆర్ ఏమీ మాట్లాడడం లేదన్నారు. ఫీనిక్స్ పైన సీబీఐ దాడులు జరుగుతున్నాయని.. కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐలో ఇరుక్కుపోయారని అన్నారు. సీబీఐ విచారణలో కవిత ముద్దాయిగా తేలుతుందని.. తక్షణమే కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.