రాష్టంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ రిజర్వాయర్ ను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణం వద్ద భూ నిర్వాసితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూ నిర్వాసితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం చెప్పినట్లుగా ముంపునకు గురవుతున్న భూములకు మార్కెట్ విలువను లెక్కలోకి తీసుకొని, దానికి మూడింతలు రెట్టింపు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
భూ నిర్వాసితులు తమ భూమిని కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయించి, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే అవేవి బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కచేయట్లేదని ధ్వజమెత్తారు. అధికార బలంతో బీఆర్ఎస్ కోర్టు ఆర్డర్లు ఉన్న భూములలో పనులు చేస్తూ అడగడానికి వెళ్లిన భూ నిర్వాసితులను అధికారుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు మేలు చేసే విధంగా.. న్యాయ బద్ధంగా చట్టానికి లోబడి పని చేయాలని ఉదండాపూర్ ప్రాజెక్టు నుంచి నిర్వాసితుల తరపున న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ని భట్టి కోరారు.