బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గతనెల 16వ తేదీన ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. వేకువజామునే దుండగుడు మెట్ల మీద నుంచి వచ్చి సైఫ్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి సైఫ్ ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న సైఫ్ ను వెంటనే ఆటోలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు సర్జరీలు చేసి.. వెన్నుపాములో ఉన్న కత్తిని తొలగించారు. దీంతో సైఫ్ అలీఖాన్ ప్రాణపాయం నుంచి బయటపడ్డారు.
ఇదిలా ఉంటే.. కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్ ఇంట్లోని సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్ నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్ పై దాడి చేసింది అతనేనని పోలీసులకు తెలిపారు. ఆరోజు దాడికి పాల్పడింది మహమ్మద్ షరీపూల్ ఇస్లాం షెహజాద్ అని తేల్చి చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్ కు చెందిన షరీపుల్ ఇస్లాం షెహజాద్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే.