మారుతున్న జీవనశైలికి అనుగుణంగా కొత్త గ్యాడ్జెట్లు సిద్ధమవుతున్నాయి. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అన్నింట్లోనూ కొత్త మార్పుల దిశగా ఆయా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. టచ్ ఫోన్లలో యాపిల్ నేటి తరంలో అద్భుతమే చేశాయని చెప్పుకోవచ్చు. తర్వాత ట్యాబ్లెట్‌తోనూ టెక్నాలజీ ప్రియుల్ని అలరించిన యాపిల్.. ఇప్పుడు డిజైన్ మార్చనుంది. మడత ఫోన్‌లతో మురిపించేందుకు సిద్ధం అవుతోంది. సగానికి ఫోల్ట్ చేసి వాడుకునేలా ఉండే ఫోన్ తెర పరిమాణం 7.6 అంగుళాలు. అంటే.. మడత విప్పితే సాధారణ ఫోన్‌ల కంటే కాస్త పొడుగుగా కనిపిస్తుంది. 2023 నాటికి దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
ఫోల్డ్ ఫోన్లే కాదు ఆ తరహాలో ల్యాప్‌టాప్‌లు కూడా తయారవుతున్నాయి. 360 కోణాల్లో తిప్పుకునేందుకు వీలుగా దీనికి రూపకల్పన చేసింది ఎల్జీ. ఎల్‌జీ మార్కెట్‌లోకి తెచ్చిన ‘గ్రామ్ 360 ల్యాప్‌టాప్’ 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిప్పుకుని అవసరం మేరకు పని చేసుకోవచ్చు. ల్యాపీలానే కాకుండా ట్యాబ్‌గానూ వాడుకోవచ్చు. ఫుల్ స్క్రీన్‌తో స్లీమ్‌గా తీర్చిదిద్దాయి. హెచ్‌డీ వెబ్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ దీంట్లోని ప్రత్యేకతలు. తెర పరిమాణం 14, 16 అంగుళాలు. రిజల్యూషన్ 1920/1200 పిక్సల్స్. 8జీబీ ర్యామ్. స్టోరేజ్ సామర్థ్యం 256జీబీ. విండోస్ 10 హోం ఓఎస్ వెర్షన్‌తో పని చేస్తుంది. బ్యాక్లిట్ కీబోర్డు, టచ్‌ప్యాడ్ సపోర్టుతో వాడుకోవచ్చు. దీని అంచనా ధర రూ.1.36 లక్షలు పై మాటే.
ప్రస్తుత మార్కెట్‌లో గేమింగ్‌కు అనువుగా ఉన్నవాటికే డిమాండ్ ఉంటుంది. ఆ వరుసలో ముందుండే ఆసూస్ కంపెనీ వచ్చే నెలలో గేమింగ్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పేరు ‘ఆర్‌ఓజీ ఫోన్ 5’. స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో మెరుపు వేగంగా గ్రాఫిక్స్‌ని ప్రాసెస్ చేస్తుంది. ర్యామ్ 16జీబీ స్టోరేజ్ సామర్థ్యం 512జీబీ. ఫుల్-హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే పరిమాణం 6.78 అంగుళాలు. రిజల్యూషన్ 1080/2340 పిక్సల్స్. కెమెరాలు వెనుక మూడు (64ఎంపీ, 16ఎంపీ, 8ఎంపీ) ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32ఎంపీ. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ సపోర్టుతో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్. దీని అంచనా ధర రూ.50,000.
టెక్నాలజీ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో ఈ-వేస్ట్ కూడా పెరుగుతుంది. ఆ వృథాను తగ్గించి పర్యవరణానికి మేలు చేసేట్లు భవిష్యత్ తరాలకు భూమిని భద్రంగా అందించే లక్ష్యంతో కొత్త ఉత్పత్తుల రూపకల్పన దిశగా ‘హెచ్‌పీ’ ముందడుగు వేసింది. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ని వాడి పెవిలియన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటి ప్రారంభ ధర రూ.62,999 నుంచి పైచిలుకే ఉంటాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.