ఏపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయింది. ఈ మేరకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారని మీడియాకు వెల్లడించారు బొత్స సత్యనారాయణ. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పేర్లు ఫైనల్ చేశారని స్పష్టం చేశారు.
బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారని వెల్లడించారు. ఈ స్థాయిలో బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు బొత్స సత్యనారాయణ.
సీఎం జగన్ అన్ని కులాలకు పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు. నాకు రాజ్యసభ అవకాశం కల్పించటం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇది బీసీ ఉద్యమానికి, ఉద్యమకారుడిగా నాకు ఒక గౌరవం, గుర్తింపు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు పెద్దపీట వేస్తున్నారని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.