తెలంగాణలో పోలీస్ శాఖలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. అభ్యర్థులు భారీగానే దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 6.50 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పోలీసు శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుల్, అగ్నిమాపక, రవాణా, ప్రత్యేక భద్రతాదళం తదితర శాఖల్లో పోలీసుల నియామకానికి టీఎస్ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. మే 20వ తేదీతో గడువు ముగుస్తుంది. అయితే ఇప్పటికే 6.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
గడువు ముగిసే నాటికి మరో 1.50 లక్షలు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. 2018 ఉద్యోగ ప్రకటనలో 18 వేల పోస్టులకు 7.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 17,281 పోస్టుల్లో 16,694 పోస్టులు కానిస్టేబుల్ స్థాయిలోనివి. దీంతో ఈ సారి కానిస్టేబుల్ పోస్టులకు గట్టి పోటీ నెలకొంది. కేవలం కానిస్టేబుల్‌కు సంబంధించే 5-6 లక్షల దరఖాస్తు వస్తాయని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అంచనా వేస్తోంది.