కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే. లో-బీపీ కావటంతో ఆయన మృతి చెందారని తెలుస్తోంది. అయితే.. రోశయ్య ఎన్నో పదవులు పొంది.. చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
రోశయ్య రాజకీయ నేపథ్యం…
రోశయ్య ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలకు మంత్రి గా పనిచేశారు. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ మంత్రి రోశయ్య పని చేశారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖల బాధ్యతలను తీసుకున్నారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రి గా పని చేశారు. 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.
ముఖ్యమంత్రిగా
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేశారు.
1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు
2009, సెప్టెంబరు – 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు