గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కూరగాయ ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 శాతం మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో కూరగాయాలు అందుబాటులో లేక ధరలు పెరిగినట్లు సమాచారం. డిమాండుకు సరిపడా సరఫరా లేకపోవడం కూడా అందుకు మరో కారణంగా కనిపిస్తోంది. అయితే, కూరగాయల ధరలు చూసి సామాన్యడు వణికిపోతున్నాడు. ధరలు ఇలా ఉంటే ఎలా బతుకుతామని ఆవేదన చెందుతున్నాడు.
ప్రస్తుతం ఉప్పల్ మార్కెట్లో టమాటా కిలో రూ.70 ఉండగా, వంకాయ 80, బెండకాయ 60, చిక్కుడు కాయ 60, దొండకాయ 60, పచ్చిమిర్చి 30, క్యాప్సికం 80, కాకరకాయ 60, గోరుచిక్కుడు 60, సొరకాయ 30 నుంచి 40, ఆలుగడ్డ కేజీ 50నుంచి 60, బీరకాయ రూ.70 నుంచి 80 గా పలుకుతున్నాయి. నగరంలోని వివిధ మార్కెట్లలో రూ.10 నుంచి 20 వ్యత్యాసంతో ధరలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు చొరవ చూపాలని సామాన్య,పేద ప్రజలు కోరుతున్నారు.