డైలాగ్ ఆఫ్ ద డే : స్వామి చెప్పిందే వేదం ?

-

మాట జాగ్ర‌త్త అని  చెప్పే మునులు స్వామీజీలు
ఎందుక‌నో మాట త‌ప్పి మాట్లాడుతున్నారు
ఆ విధంగా మాట్లాడాక కూడా త‌ప్పులు అయితే దిద్దుకోవ‌డం లేదు
అందుకు తార్కాణం నిన్న‌టి రోజు తెలంగాణ వాకిట గొప్ప సంస్కృతికి
ఆన‌వాలు అయిన స‌మ్మ‌క్క సార‌క్క‌ల‌పై ఆయ‌న చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు
క్ష‌మాప‌ణ‌లు లేవు.. ఆయ‌న చెప్ప‌రు.. చెప్ప‌బోరు కూడా! 

ఆదివాసీల సంప్ర‌దాయాల‌ను విమ‌ర్శిస్తూ మాట్లాడే ధోర‌ణి ఇప్పుడొక వివాదం అయింది. అయినా కూడా ఆయ‌న మాట మార‌లేదు. కోట్ల ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడిన మాట అస్స‌లు మార‌లేదు. ఆయ‌న‌లో ప‌శ్చాత్తాప చింత‌న అన్న‌ది లేనేలేదు.ఆయ‌నే జియ‌రు స్వామి. చిన జియ‌రు స్వామి.

రెండు తెలుగు రాష్ట్రాల‌నూ శాసించే శ‌క్తి స్వామికి ఉంది. స్వామి అంటే చిన‌జియ‌రు స్వామి అని అర్థం.ఆయ‌నకు రాజ‌కీయ నాయ‌కుల‌తో స‌న్నిహిత బంధాలే ఉన్నాయి.ఆ విధంగా స్వామి అటు తెలంగాణ‌లో,ఇటు ఆంధ్రాలో చాలా ప‌లుకుబ‌డి పెంచుకున్నారు.ఓ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కూ ఆయ‌న పెద్ద దిక్కు.రాజ‌గురువు. ఆ విధంగా జ‌గ‌న్ కానీ ఆ విధంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కూ కేసీఆర్ కానీ ఆయ‌న్నొక దైవ స్వ‌రూపులుగానే చూశారు.వారి సేవ‌లోనే ఉన్నారు..ఉంటారు కూడా! వాస్త‌వానికి అదేం త‌ప్పు కాకున్నా చాలా చోట్ల చాలా విమ‌ర్శ‌లు అయితే ఉన్నాయి.

స్వామీజీల‌కు పాద పూజ చేయ‌డంలో రాజ‌కీయ నాయ‌కులు ఎందుకింత ప్రాధాన్య మిస్తార‌ని కొన్ని వ్యాఖ్య‌లు కూడా వ‌చ్చాయి.విశ్వాసాల‌ను గౌర‌వించ‌డంలో త‌ప్పు లేదు కానీ ఓ సీఎం స్థాయి వ్య‌క్తి స్వామీజీ ల ద‌గ్గ‌ర‌కు పోయి సాష్టాంగ ప్ర‌ణామాలు చేయ‌డంలో ఏమ‌యినా అర్థం ఉందా అని కూడా కొన్ని ప్ర‌జా సంఘాలు గ‌గ్గోలు పెట్టాయి.పెడుతున్నాయి కూడా! ఈ ద‌శ‌లో స్వాములు చెప్పిందే వేదం అని భావించాలా? లేదా హిందూ మ‌త ప‌రిర‌క్ష‌ణ అన్న‌ది వీరి క‌నుస‌న్న‌ల్లోనే సాగిపోతుంద‌ని ప‌రిగ‌ణించాలా? ఇదే ఇప్పుడు పెద్ద సందేహంగా ఉంది.

కోట్ల మంది ఆచ‌రించే మ‌తానికి స్వాముల ప‌రిర‌క్ష‌ణ ఏంటి అన్న‌ది ఓ ప్ర‌శ్న‌.విశ్వాసాల ఆధారంగా ఎవ‌రికి వారు ఇవాళ త‌మ ప‌రిధిలో తాము ఉంటూ నిబ‌ద్ధ‌త‌తోనే జీవిస్తున్నారు.ఓ విధంగా సామాజిక క‌ట్టుబాటు అన్నింటా ఉంది.చదువు విస్తారంలోకి వ‌చ్చాక జ్ఞానం ప్ర‌తి ఒక్క‌రి స్థాయినీ ఉన్న‌తీక‌రించాక ఓ స్వామీజీ వ‌ల్ల‌నే సంఘం,స‌మాజం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటుంద‌ని చెప్పేందుకు వీల్లేదు.అయితే విశ్వాసాలు ఆచారాలు సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ అన్న‌వి స్వాములతోనే ముడిప‌డి లేక‌పోయినా సంబంధిత వైదిక కార్య‌క్ర‌మాల ప్ర‌భావం త‌ప్ప‌క స‌మాజం పై ఉంటుంది. ఇక్క‌డే ఓ చిన్న చిక్కు వ‌చ్చి ప‌డుతోంది.గిరిజ‌న సంప్ర‌దాయాలు, ప‌ల్లె సంప్రదాయాలు వీటిని గౌర‌వించ‌కుండా స్వాములు మాట్లాడుతున్నారు.ఓ సంప్ర‌దాయాన్నీ ఓ విశ్వాసాన్నీ ఓ ఆచారాన్నీ ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగిస్తున్న‌ప్పుడు వాటి వ‌ల్ల స‌మాజానికి జ‌రిగే హాని ఏమీ లేన‌ప్పుడు స్వామీజీల‌కు వ‌చ్చిన అభ్యంత‌రం ఏంటి?

అన్న ప్ర‌శ్న ఒక‌టి వినిపిస్తోంది.ఈ దశ‌లో చిన‌జియ‌రు స్వామి నిన్న‌టి వేళ మీడియా ముఖంగా స్పందించారు.తెలంగాణ వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క సార‌క్క‌ల‌పై తాను  చేసిన వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చారే కానీ క్ష‌మాప‌ణ‌లు కోర‌లేదు.దీంతో సంబంధిత వ‌ర్గాలు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నాయి. దైవానికి తాము ప్ర‌తినిధులం అని చెప్పుకోవ‌డంలో స్వామీజీలు ముందు వ‌రుసలో
ఉంటారు అన్న‌ది ఓ వాస్త‌వం. అది కూడా త‌ప్పేం కాద‌ని కానీ మూల‌వాసుల జీవితాల‌ను ఎంతో ప్ర‌భావితం చేసిన వ‌న దేవ‌త‌ల విష‌య‌మై తాము చేసిన అనుచిత వ్యాఖ్యల‌పై కనీస విచారం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డ‌మే ఇప్ప‌టి విషాదం.

Read more RELATED
Recommended to you

Exit mobile version