రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఈటల రాజేందర్ తీసుకునే నిర్ణయం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆయన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారు, చేస్తే ఆ తర్వాత ఏ పార్టీలో చేరతారంటూ ఇటు మీడియా, అటు సామాన్య ప్రజలు లెక్కలేసుకుంటున్నారు. కాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వని ఆయన నిన్న మాత్రం ఓ ఛానల్‌తో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన రాజీనామాపై స్పందించారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరం చూశామని, కరోనా టైమ్‌లో ఎలక్షన్లు పెట్టొద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఓ వైపు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలాంటి టైమ్‌లో తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లదలచుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
ఈ కరోనా సంక్షోభం తగ్గిన తర్వాత తాను ఎమ్మెల్యే పదవికి, టీఆర్ ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నిజాలు తెలుస్తాయంటూ చెప్పారు. ఇక కోర్టు కూడా మెదక్ కలెక్టర్ హరీశ్ ఇచ్చిన నివేదిక తప్పని తేల్చిందని, కాబట్టి తనపైన వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కుండబద్దలు కొట్టారు. ఇప్పట్లో ఏ పార్టీలో చేరనని, నియోజకవర్గ ప్రజలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.