తెలుగు రాష్ర్టాల సీఎంలకు చాలా పోలికలు

-

స్వతంత్ర భారతదేశం లో అనేక కులాలు ఉన్నాయి. రాజకీయంగా చూస్తే అత్యధికంగా కులాల సమీకరణలోనే ఎక్కువగా పదవులు వస్తూ ఉంటాయి. కులాల ప్రాతిపదికన రాజకీయంగా,సామాజికంగా పదవులను అనుభవించే వారు చాలా మందే ఉన్నారు.దేశంలో ఇటీవల రాజకీయాలు ప్రధానంగా కులాల చుట్టూ తిరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఒకే కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక ఆసక్తికర పరిణామమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది.

తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్స్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందో అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డిని సీఎం గా ఖరారు చేసింది.అదే వర్గానికి చెందిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నారు.అలా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాలలో ఒకేసారి సీఎం పదవుల్లో ఉండడం ఒక అరుదైన విశేషంగా చెప్పుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి విషయాలు అరుదుగా జరుగుతుంటాయని చర్చించుకుంటున్నారు.

ఒకే కులానికి చెందిన వ్యక్తులు ఒకేసారి రెండు రాష్ట్రాలకు సీఎం లుగా చేసిన సంఘటనలు గతంలోనూ ఉన్నాయి.1964-71 లో ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మనందరెడ్డి మఖ్యమంత్రిగా ఉండగా పాండిచ్ఛేరి ముఖ్యమంత్రి గా వెంకట సుబ్బారెడ్డి పనిచేశారు.అలాగే ఎ.పిలో 1992-94లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఉండగా అదే సమయంలో పాండిచ్ఛేరి ముఖ్యమంత్రిగా వెంకటసుబ్బారెడ్డి ఉన్నారు.మళ్ళీ 2010-14 మధ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న సమయంలో పాండిచ్చేరిలో వైద్య లింగం రెడ్డి సీఎంగా పనిచేశారు.ఇలా రెండు పర్యాయాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు రెండు రాష్ర్టాలకు ముఖ్యమంత్రులుగా చేశారు.

ఇక ప్రస్తుత తెలుగు రాష్ర్టాల సీఎంలకు కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. విభజన తరువాత ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి రెండో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా ….ఆంధ్రప్రదేశ్‌కి కూడా రెండో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు.పాదయాత్రలు చేశాకే ముఖ్యమంత్రి పదవులు దక్కాయి ఈ ఇద్దరికి.ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు.2017 నవంబరు 6న ప్రారంభమైన ఈ యాత్ర ద్వారా 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు జగన్‌. అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు.రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి ముందు పాదయాత్ర చేశారు. ఈ ఏడాది ప్రారంభం అనగా 2023, ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె నుంచి ప్రారంభమైన రేవంత్‌ పాదయాత్ర ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో ఆరునెలల పాటు సాగింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది.ఆ విధంగా రేవంత్‌రెడ్డి కూడా సీఎం అయ్యారు.

సీఎం జగన్‌…సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ జైలు జీవితం గడిపిన వారే.. ఓ విధంగా చెప్పాలంటే వారిలో అధికారం పట్ల కసి పెంచింది కూడా జైలు జీవితమే. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ 27 మే 2012న అరెస్టు అయ్యారు.అక్రమ మార్గంలో భారీగా ఆస్తులు కూడబెట్టారని,మనీ లాండరింగ్‌కు పాల్పడారని ఆరోపిస్తూ సీబీఐ అదుపులోకి తీసుకుంది.ఆ తరువాత బెయిలుపై జగన్‌ విడుదలైనా ఇప్పటికీ ఈ కేసులు కొనసాగుతున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. ఓటుకు నోటు కేసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీడియోలు వెలుగులోకి వచ్చిన సంఘటన అప్పట్లో తెలుగు రాష్ర్టాల్లో సంచలనం రేపాయి.ఈ కేసులో అరెస్ట్‌ అయిన రేవంత్‌రెడ్డి కొంతకాలం చర్లపల్లి జైలులో ఉన్నారు.జైలు నుంచి బయటికి వచ్చాక కాంగ్రెస్‌లో చేరి కసితో పోరాడి అధికారంలోకి రావడమే కాదు ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించారు.ఈ ఇద్దరూ చర్లపల్లి జైలులోనే జైలు జీవితం గడిపారు.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు 50వ దశకంలోనే ఉన్నారు.సీఎం జగన్‌ వయసు 51 కాగా,రేవంత్‌రెడ్డి వయస్సు 54 సంవత్సరాలు.ఇద్దరికీ సంతానం అమ్మాయిలే.ఇలా అనేక అంశాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులకు చాలా పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల ప్రజలు సరదాగా ఈ పోలికల గురించి చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version