ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో పుట్టిన బిడ్డగా, మానేరు నీరు తాగిన వ్యక్తిగా చెబుతున్నానని.. జిల్లా సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు పేర్కొన్నారు. అందుకు రాజకీయాలకు అతీతంగా స్థానిక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ముందుకు వెళ్తామన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
అంతకుముందు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లాలోని 4 వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లందించడం గర్వకారణమని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజల డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించే క్రమంలో స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించామన్నారు.వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాదం స్కీంలో చేరుస్తున్నామని, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్లో చేరుస్తామని తెలిపారు.అదేవిధంగా సిరిసిల్ల, వంగరలో నవోదయ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.