తెలంగాణలో తాగునీటి సరఫరాకు కొరత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని.. వారి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని మంత్రి పొన్నం స్పష్టంచేశారు. మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ఎల్ఎండీ, మిడ్ మానేరులో తాగు, సాగునీటికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి మెరుగ్గానే ఉన్నట్లు వివరించారు.లోయర్ మానేరు డ్యాం పరిధిలోని కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం తగినంత నీటిని నిలువ ఉంచి, మిగతా నీటిని సాగు నీటి అవసరాల నిమిత్తం కిందకు వదులుతున్నామని చెప్పారు.గతేడాది లోయర్ మానేరు డ్యామ్‌లో ఇదే సమయానికి 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయని వెల్లడించారు.