ఏపీలోని విశాఖపట్నంలో గల కేంద్ర కారాగారంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అనుకోకుండా జైలు అధికారులు ఒక్కసారిగా ఖైదీల బ్యారాక్ లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. అంతేకాకుండా భూమి లోపల పాతిపెట్టిన ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక సెల్ ఫోన్ బ్యాటరీ, రెండు డేటా కేబుళ్ళు లభ్యమయ్యాయి.
దీంతో జైలు అధికారులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఆరిలోవ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జైలు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. జైలులోకి ఫోన్లు, బ్యాటరీలు ఎలా వచ్చాయనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. జైలు అధికారుల్లో ఎవరైనా వారికి సాయం చేస్తున్నారా? అన్నకోణంలోనూ విచారణ చేపట్టినట్లు సమాచారం.