చర్చిలో ప్రార్థన చేసేందుకు బైకు మీద వెళ్తున్న ఓ ఫ్యామిలీని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం విజయవాడ చెన్నై జాతీయ రహదారిపై మార్టూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కొల్లు రాము, పల్లపు గోపి (29)గా గుర్తించగా.. కొల్లు రాము భార్య కొల్లు ఉమా (29) తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.
దీంతో వెంటనే ఆమెను అత్యవసర వైద్యం కోసం ముందు చిలకలూరిపేటకు, అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు సమాచారం. మృతులు విజయవాడ బాంబే కాలనీకి వచ్చి కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తుండగా.. బల్లికురవ మండలం ధర్మవరం చర్చిలో ప్రార్థనకు వెళుతున్న టైంలో నేషనల్ హైవే రాజుపాలెం రెస్ట్ ఏరియా వద్ద ఈ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ని అరెస్టు చేసినట్లు తెలిపారు.