కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పుడు ఏ విధంగా భయపెడుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 167 దేశాలకు కరోనా వ్యాప్తి చెందగా ప్రపంచవ్యాప్తంగా 1 లక్ష మందికి పైగానే కరోనా ఉన్నట్లు నిర్దారణ అయింది. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 8వేల మంది కరోనాతో మృతి చెందారు. అయితే కరోనా అంత తీవ్రతరం కాకపోయినా ఇది చాప కింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతుండడంతో అందరినీ కలవరానికి గురిచేస్తోంది. అయితే కరోనా కాకుండా గతంలో పలు మహమ్మారి వ్యాధులు ప్రపంచాన్ని గడగడలాడించాయి. దీంతో కొన్ని కోట్ల మంది ఆ వ్యాధులతో మృతి చెందారు. ఆ వ్యాధుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లేగ్ ఆఫ్ జస్టినియన్ 541-542
541 నుంచి 542 సంవత్సరాల నడుమ ఈ వ్యాధి బాగా ప్రబలింది. బైజాంటైన్ సామ్రాజ్యాన్ని, మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న అనేక నగరాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. పోర్టుల్లోకి పెద్ద ఎత్తున అశుభ్రమైమన షిప్పులు రావడం వల్ల ఈ వ్యాధి మరింత తేలిగ్గా వ్యాపించింది. దీంతో సుమారుగా 2.5 కోట్ల మంది మృతి చెందారు.
బ్లాక్ డెత్ 1346 – 1353
ఈ వ్యాధి అప్పట్లో ఆసియాలో ఉద్భవించింది. దీని వల్ల 2 కోట్ల మంది వరకు చనిపోయారు. షిప్పుల ద్వారా ఈ వ్యాప్తి చెందినట్లు చెబుతారు.
కలరా – 1852
1852వ సంవత్సరంలో వచ్చిన కలరా మొదట భారత్‌లో పంజా విసిరింది. ఆ తరువాత ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో 10 లక్షల మంది వరకు చనిపోయారు.
బాంబే ప్లేగ్ – 1896
ముంబైలో అప్పట్లో వచ్చిన ఈ ప్లేగ్ వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. ఆ తరువాత టీకాను కనిపెట్టడంతో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టింది.
కలరా 1910-1911
1910 నుంచి 1911వ సంవత్సరం నడుమ వచ్చిన కలరా వల్ల ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా, రష్యాలలో చాలా మంది చనిపోయారు. ఆ తరువాత ఈ వ్యాధి మన దేశంలోకి వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 80 లక్షల మంది వరకు చనిపోయారు.
స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా – 1918
ఈ వ్యాధి వల్ల 5 కోట్ల మంది వరకు చనిపోయారు. రద్దీగా ఉండే ఆసుపత్రులలో సరిగ్గా శుభ్రత పాటించకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చింది.
ఇన్‌ఫ్లూయెంజా – 1957
1957లో వచ్చిన ఆసియా ఇన్‌ఫ్లూయెంజా వల్ల 20 లక్షల మంది వరకు చనిపోయారు. తరువాత దీనికి టీకాను తయారు చేశారు.
ఇన్‌ప్లూయెంజా 1968
1968లో హాంకాంగ్‌లో మొదటగా ఈ వ్యాధి ఉద్భవించింది. తరువాత ఇది రష్యాకు వ్యాప్తి చెందింది. దీంతో 20 లక్షల మంది చనిపోయారు.
హెచ్ఐవీ / ఎయిడ్స్ (2005-2012)
1976లో మొదటగా కాంగోలో ఎయిడ్స్‌ను కనుక్కున్నారు. కానీ ఈ వ్యాది 2005 నుంచి 2012 మధ్య ఎక్కువగా వ్యాప్తి చెందింది. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీంతో ఆఫ్రికాలో పెద్ద ఎత్తున అప్పట్లో ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల 3.50 కోట్ల మంది వరకు చనిపోయారు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఎయిడ్స్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.