మానవ మనుగడకు అడవులు ఎంతో అవసరం. అడవులు ఉండటం వల్లే ప్రకృతి, పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి, కార్భన్‌డైఆక్సైడ్‌ను ఆహారంగా తీసుకుని ప్రజలకు మేలు చేస్తుంది. అందుకే మన పెద్దలు చెప్పారు.. ‘‘వృక్షో రక్షతి.. రక్షితః’’ అని. అడవులను కాపాడుకుంటే.. అవి మనల్ని కాపాడుతాయని దీని అర్థం. ప్రపంచవ్యాప్తం పొల్యూషన్ పెరిగిపోతుంది. వాతావరణంలో కార్భన్‌డైఆక్సైడ్ శాతం ఎక్కువ అవడంతో వాతావరణంలో ఓజోన్ పొర దెబ్బతింటోంది. పర్యావరణాన్ని, అడవులను కాపాడేందుకు ప్రపంచదేశాలు కృషి చేస్తున్నారు. అందుకే మార్చి 21వ తేదీన అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ మేరకు ప్రపంచంలోనే అది పెద్ద అడవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
అమెజాన్..
ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ప్రాంతం అమెజాన్. ఇది దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ఉంది. 23 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంతో పొరుగు దేశాల్లోనూ విస్తరించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 20శాతం ఆక్సిజన్ ఈ అడవి నుంచే ఉత్పత్తి అవుతుంది.
కాంగో..
కాంగో అడవి ఆఫ్రికా ఖండంలో ఉంది. 7,81,249 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సుమారు 10 వేల జాతులకు చెందిన జంతువులు, 600 రకాల చెట్లు ఈ అటవి ప్రాంతంలో ఉన్నాయి.
వాల్డివియన్ టెంపరేట్..
వాల్డివియన్ టెంపరేట్ అటవీ ప్రాంతం దక్షిణ అమెరికాలోని చిలీ ఉంది. దీని విస్తీర్ణం 95,800 చదరపు మైళ్లు, ఈ అడవుల్లో ప్రాచీన కాలం నాటి వృక్షాలు, వైల్డ్ బోర్స్ వంటి జంతువులు ఎక్కువగా ఉంటాయి.
టోంగాస్..
అమెరికాలోనే అతిపెద్ద జాతీయ అటవీ ప్రాంతం ఇది. టోంగాస్ అలస్కాలో ఉంది. దీని విస్తీర్ణం 26,278 చదరపు మైళ్లు. అమెరికా వ్యాప్తంగా దాదాపు 12 శాతం కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
సుందర్బన్స్..
సుందర్బన్స్ అటవీ ప్రాంతం కొంతభాగం భారత్‌లో, మరికొంత భాగం బంగ్లాదేశ్‌లో ఉంది. దీని విస్తీర్ణం 3,900 చదరపు మైళ్లు. ఈ అడవిలో 50 రకాల క్షీరద జాతులు, 60 రకాల పాముల జాతులు, 300లకు పైగా పక్షి జాతులు ఉన్నాయి.
షిషుయాంగ్‌బన్నా..
షిషూయాంగ్‌బన్నా చైనాలోని యూన్నాన్ ప్రావిన్స్‌లో ఉంది. దీని విస్తీర్ణం 927 చదరపు మైళ్లు. ఈ అటవీ ప్రాంతంలో 3,500 రకాల వృక్షాలు ఉన్నాయి. అంతరించిపోయే దశలో ఉన్న పులు, గొబ్బొన్స్, ఆసియా ఏనుగులు ఉన్నాయి.
డైంట్రీ..
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అటవీ ప్రాంతం డైంటీ. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉంది. దీని విస్తీర్ణం 463 చదరపు మైళ్లు.
కినబాలు..
కినబాలు అటవీ ప్రాంతం మలేషియాలో ఉంది. దీని విస్తీర్ణం 291 చదరపు మైళ్లు. ఈ అటవీ ప్రాంతంలో 5వేల రకాల జాతుల మొక్కలు, గొబ్బొన్స్, బోర్నియన్, టార్సియర్స్ ఒరంగ్‌టాన్స్ వంటి జంతువులు నివసిస్తున్నాయి.
మిండో నంబిల్లోక్లౌడ్..
ఈ అటవీ ప్రాంతం ఈక్వెడార్‌లోని మిండో ప్రాంతంలో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 74 చదరపు మైళ్లు.
సింహరాజ..
సింహరాజ అరణ్యం శ్రీలంకలో ఉంది. దీని విస్తీర్ణం 34 చదరపు మైళ్లు. ఈ అటవీ ప్రాంతంలో లోయలు, నదులు ఎక్కువగా కనిపిస్తాయి.