వైఎస్ జగన్ అధికారంలోకి రాక మునుపు నుచి టీడీపీకి మద్ధతుగా ఉన్న మీడియాపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సీఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజు కూడా ఆయన ఆ మీడియాకి వార్నింగులు కూడా ఇచ్చారు. టీడీపీకి మద్ధతు ఇచ్చే ఏబీఎన్, టీవీ5, ఈటీవీల పేర్లని డైరెక్ట్ గానే చెబుతూ…ప్రభుత్వం గురించి అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కాకముందే ఏబీఎన్, టీవీ5లపై అప్రకటిత బ్యాన్ విధించారు.
అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలిలోనే కొన్ని ప్రాంతాల్లో ఏబీఎన్ ని బ్యాన్ చేసేశారు. ఇక తాజాగా వ్యతిరేకవార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంగా రాష్ట్రం మొత్తం ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయాలంటూ, కేబుల్ ఆపరేటర్లకు మంత్రులు హెచ్చరికలు పంపారు. ఒకవేళ తమ మాట కాదని ప్రసారం చేస్తే… ఆయా ఇళ్లకు కేబుల్ ఆపేసి ఫైబర్‌నెట్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో కేబుల్ ఆపరేటర్లు, మంత్రుల ఒత్తిడికి తలొగ్గి రెండు ఛానళ్ళని బ్యాన్ చేసేశారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్లు అత్యధిక కవరేజీ ఇచ్చాయన్న అసంతృప్తి, మూడు నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకిత వచ్చిందనే విధానంలో ఆయా మీడియా వర్గాలు ప్రసారం చేయడంతో బ్యాన్ చేయించారు. గతంలో కొన్ని చానళ్ళని బ్యాన్ చేసిన సందర్భాల్లో పలువురు మేధావులు, ప్రజా సంఘాలు మీడియా గొంతు నొక్కొద్దని బహిరంగంగానే ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. మరి ఇప్పుడు వారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
పైగా ట్రాయ్ రూల్ ప్రకారం ఉచిత ఛానళ్ళని నిలిపివేసే హక్కు ఎవరికి లేదు. ఏబీఎన్, టీవీ5లు కూడా ఉచిత ఛానళ్లే. వీరు ట్రాయ్ కు ఫిర్యాదు చేస్తే… చర్యలు తీసుకుని వాటి ప్రసారాలు పునరుద్ధించే అవకాశం ఉంది. ఈ బ్యాన్ ఎప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.