కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారంటూ కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, అది వారి మూర్ఖత్వమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.అబద్ధాలు, దొంగ హామీలతో పబ్బం గడపాలనుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన సంగతిని మర్చిపోయారని,కేంద్రంపై విషం కక్కడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర రంగాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. వివిధ శాఖల వారీగా బడ్జెట్ పూర్తి కేటాయింపుల తర్వాత వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.50 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించడం రైతుల పట్ల, వ్యవసాయం రంగం పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఇది దేశ హిత బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏకంగా రూ. 11.50 లక్షల కోట్లను మౌలిక రంగాల అభివృద్ధికి కేటాయించడం గొప్ప విషయమని ,విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి పెద్దపీట వేశారని అన్నారు.మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ. 3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేయడం గొప్ప విషయమని అన్నారు.