తెలంగాణలో సీఎం రేవంత్ చేస్తున్నది ప్రజాపాలన కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది పాలన కాదు పీడన. ప్రజల వేదన అరణ్య రోదన.రైతుల చెరబడితిరి, పేదల ఇండ్లు కూలగొడ్తిరి, రైతుబంధు ఎత్తేస్తిరి రైతుభీమాకు పాతరేస్తిరి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి.. అమ్మవడిని ఆగం చేస్తిరి.. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి.. ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరి..
హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు ఆశాలను అవమానపరిస్తిరి, టీఎస్ టీజీగా చేసిచార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తిరి.. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి .. ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేస్తిరి.. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తిరి.. మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో..తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటు.. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది, కాలంబు రాగానే కాటేసి తీరుతుంది.. జై తెలంగాణ’ అని కేటీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.