వయస్సు పైబడితే సహజంగానే ఎవరైనా సరే చేస్తున్న వృత్తి నుంచి రిటైర్ అవుతారు. వార్ధక్యంలో ఎలాంటి, ఒత్తిళ్లు, ఆందోళనలు లేకుండా కాలం గడపాలని చెప్పి కొందరు పని నుంచి రిటైర్ అవుతారు. కానీ కొందరు మాత్రం అలా కాదు. వారికి వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. వారు ఎంత వృద్ధాప్యం వచ్చినా చేస్తున్న పనిని అస్సలు విడిచిపెట్టరు. అలాంటి వారిలో లాయర్ లేఖరాజ్ మెహతా ఒకరు.
లేఖరాజ్ మెహతా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వారు. జూన్ 4, 2021న ఇటీవలే ఆయనకు 100 ఏళ్లు నిండాయి. అయినప్పటికీ ఆయన న్యాయవాదిగా ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆయనకు వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. శరీరంలో పనిచేసే సత్తా ఉంటే రిటైర్మెంట్ ఎందుకు ? అంటారాయన. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచే కేసులను వాదిస్తున్నారు. అందుకు గాను ఇంటర్నెట్‌ను, జూమ్‌ను ఆయన బాగా వాడడం నేర్చుకున్నారు.
లేఖరాజ్ ఎంతో మంది ప్రముఖులకు పాఠాలు బోధించారు. సీజేఐ ఆర్ఎం లోధా, జస్టిస్ దల్బీర్ భండారి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎంఎల్ సింగ్వీ తదితరులకు ఆయన పాఠాలు బోధించారు. ఆయన 1947 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కోర్టు విచారణలకు హాజరవుతున్నారు.
ఇక మెహతాకు అంతకు ముందు వీడియో కాన్ఫరెన్సింగ్ పై పెద్దగా అవగాహన లేదు. కానీ ఆయన మనవడు రామిల్ మెహతా ఆ విషయాలను చెప్పారు. ఇక కరోనా ఉన్నప్పటికీ ప్రపంచం ఆగిపోకపోవడానికి కారణం ఇంటర్నెటే అని అన్నారు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేమన్నారు. ఈ వయస్సులోనూ ఆయన న్యాయవాదిగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వృత్తిలో కొనసాగుతున్నారంటే ఆయనను గ్రేట్ అని చెప్పవచ్చు.