సరిగ్గా పనిచేయని వారికి మళ్ళీ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్ ముందు నుంచి చెబుతూనే వస్తున్నారు…ఇకనుంచైనా పనితీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్ళి బలం పెంచుకున్న వారికే సీటు ఫిక్స్ చేస్తానని అంటున్నారు. ఆ మధ్య కూడా పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు…ప్రజల్లోకి వెళ్లని ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశారు. అయితే ఇక నుంచి ఎమ్మెల్యేలకు గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని, అలాగే తమ బలం మరింత పెంచుకోవాలని సూచించారు. మళ్ళీ 151 సీట్లు గెలుచుకోవాలని…అసలు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోకూడదని ఎమ్మెల్యేలని ప్రశ్నించారు.
సరే జగన్ క్లాస్ పీకడం వల్లో లేక సీటు పోతుందనే భయమో తెలియదు గాని..వైసీపీ ప్రజా ప్రతినిధులంతా జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు…గడప గడపకు మన ప్రభుత్వం పేరిట…ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో తిరుగుతున్నారు..అయితే ఈ గడప గడప కార్యక్రమంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే..ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులని ప్రజలు నిలదీసే పరిస్తితి… తమ సమస్యలని పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేలని అడ్డుకుంటున్నారు. కేవలం పథకాలు అమలు చేయడమే కాదు.రోడ్లు, ఇళ్ళు, తాగునీరు, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నిస్తున్నారు.
ఇక జనం ప్రశ్నలకు ప్రజా ప్రతినిధులు నిదానంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొందరైతే ప్రజల్లోకి వెళ్ళేందుకే భయపడుతున్నారు. జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సరే…జనాలకు భయపడి బయట తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు..పైగా వాలంటీర్ల పెత్తనం ఎక్కువ అవ్వడం కూడా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది…ప్రజలు వాలంటీర్ల చుట్టూనే తిరగడంతో..ఇంకా తామెందుకు అనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే వారు జనంలోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఇదే పరిస్తితి రానున్న రోజుల్లో కొనసాగితే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్తితి ఘోరంగా తయారయ్యేలా ఉంది…ఇక అలాంటి ఫ్యాన్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇవ్వడం కష్టమనే చెప్పాలి..జనంలో బలం లేని ఎమ్మెల్యేలకు జగన్ ఖచ్చితంగా ఇచ్చేలా లేరు.