చంద్రబాబు క్లాస్‌ తో ఆ టీడీపీ నేతలు జేసీకి మద్దతు పలికారా !

-

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటికెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఇది తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య దశాబ్దాల ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో ఇటీవల జరిగిన పరిణామలు అందరికీ తెలిసేలా చేశాయి. ఆ టెన్షన్‌ వాతావరణం ఇంకా తొలిగిపోలేదు. సీమలో ఫ్యాక్షన్‌ గొడవలు ఎలా ఉంటాయో అంతా చూశారు. కానీ.. ఈ ఘటనపై వెంటనే స్పందించాల్సిన టీడీపీ నేతలు అంతా అయ్యాక తాపీగా బయటకొచ్చారు. దాడి జరిగినా ఖండించకుండా తమ నేతకు మద్దతుగా నిలవడంలో ఎందుకు వెనకాడారన్నదానిపై ఇప్పుడు జిల్లా టీడీపీ శ్రేణుల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.


సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై గుర్రుగా ఉన్న పెద్దారెడ్డి.. అనుచరులతో కలిసి ఏకంగా జేసీ ఇంటికెళ్లారు. అక్కడున్న కిరణ్‌ అనే వ్యక్తిని చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలకు చిక్కాయి. తర్వాత రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో రాళ్లదాడి తాడిపత్రిలో రణరంగాన్ని తలపించింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ కుటుంబానికి దశాబ్దాలుగా గొడవలు ఉన్నాయి సరే. కాకపోతే ఇద్దరూ రెండు పార్టీలకు చెందినవారు. ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు తప్పో ఒప్పో.. తమ పార్టీకి చెందినవారికి మద్దతుగా మాట్లాడతారు నాయకులు. కానీ.. తాడిపత్రి ఘటన జరిగిన వెంటనే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులెవరు స్పందించలేదు. జిల్లాలో బలమైన టీడీపీ నేతలే ఉన్నారు. వారిలో చాలా మంది గతంలో మంత్రులుగా పనిచేశారు కూడా. కానీ ఒక్కరి నుంచి కూడా వెంటనే రియాక్షన్‌ రాలేదు.

జేసీ బ్రదర్స్‌ 2014 నుంచి టీడీపీతోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడినా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినా అనంతపురం టీడీపీ నేతలు జరిగిన దానిపై సైలెంట్‌గా ఉండటమే అందరినీ ఆశ్చర్య పరిచిందట. దాడి జరిగింది తమ మీద కాదు కదా అన్నుకున్నారో ఏమో ఒక్కరు కూడా నోరు విప్పలేదు. ఈ విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్‌ అయ్యారట. జూమ్‌ యాప్‌ ద్వారా అనంతపురం జిల్లా నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. టీడీపీ కీలక నేత విషయంలో ఇలా జరిగితే మీరెవరూ స్పందించరా అదే మీకు జరిగితే ఎలా ఉంటుంది? ఈ పరిస్థితి రేపు ఎవరికైనా రావొచ్చు? అని గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారట. దాంతో పుట్టల్లోంచి చీమలు బయటకొచ్చినట్టు ఒక్కో టీడీపీ నేత రోడ్డుమీదకు వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారని చెవులు కొరుక్కుంటున్నారు.

మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, పరిటాల శ్రీరాం తదితరులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరును తప్పుపట్టారు. జేసీ ఫ్యామిలీ టీడీపీలోనే ఉన్నా.. పరిటాల కుటుంబంతో అస్సలు పడదు. అయినా వాటిని పక్కనపెట్టి పరిటాల శ్రీరాం కూడా మాట్లాడటం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచిందట. అయితే.. చంద్రబాబు చెప్పేవరకు మాట్లాడకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. మరి.. రానున్న రోజుల్లోనూ ఏదైనా జరిగిన వెంటనే స్పందిస్తారో.. లేక చంద్రబాబు చెప్పాకే రోడ్డెక్కుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version